
- భారత్‒పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం
- ములుగు జిల్లా వెంకటాపురం నుంచి వెనక్కి వెళ్లిన భద్రతా బలగాలు
జయశంకర్ భూపాలపల్లి, వెంకటాపురం, వెలుగు: కర్రె గుట్టలపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పడింది. భారత్- – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్, కోబ్రా జవాన్లను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 19 రోజులుగా ఆపరేషన్ కర్రె గుట్టల్లో పాల్గొన్న భద్రతా బలగాల్లో 9 వేల మంది వెనక్కిమళ్లారు. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి శనివారం తమకు కేటాయించిన వెహికల్స్‌లో వెళ్లిపోయారు.
ఇక కర్రె గుట్టలపై తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన డీఆర్జీ, గ్రేహౌండ్స్ పోలీసులతో కూంబింగ్ చేసే చాన్స్ ఉంది. ఇప్పటికే చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ను పూర్తిస్థాయిలో నిలిపేస్తారా? లేక స్థానిక పోలీసులతో కూంబింగ్ కొనసాగిస్తారా? అనే విషయం కొద్ది రోజుల్లో
తేలనుంది.
కర్రెగుట్టల్లో దాక్కున్నారనే సమాచారంతో ఆపరేషన్
మావోయిస్టు అగ్రనేతలు మడవి హిడ్మా, దేవా, చంద్రన్న దళాలతో పాటు సుమారు వెయ్యి మంది మావోయిస్టులు కర్రె గుట్టల్లో దాక్కున్నారనే పక్కా సమాచారంతో పోలీస్, భద్రతా బలగాలు గత ఏప్రిల్ 22న రంగంలోకి దిగాయి. ఆపరేషన్ కర్రె గుట్టలు పేరిట స్టార్ట్ చేశాయి. మావోయిస్టులు గుట్టల చుట్టూరా బాంబులను అమర్చి ఆదివాసీ, గిరిజనులెవ్వరూ గుట్టలపైకి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లుగా పోలీస్ నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. ఒకటి, రెండు బెటాలియన్లకు చెందిన కూంబింగ్ దళాలు వస్తే వారిపై అటాక్ చేసే విధంగా మావోయిస్టులు స్కెచ్ వేసినట్లుగా తెలుసుకున్నారు.
దీంతో ఒకేసారి 10 వేల మందికి పైగా పోలీస్, భద్రతా బలగాలను కర్రె గుట్టలపై మోహరించారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, శాటిలైట్ ఫోన్ల సాయంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి దాకా మావోయిస్టు అగ్రనేతలెవ్వరు పోలీసులకు పట్టుబడలేదు. అయితే.. జరిగిన ఎన్‌కౌంటర్లలో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా మావోయిస్టుల ఎదురుకాల్పులు, మందుపాతరలు పేలి ముగ్గురు పోలీసులు చనిపోయారు.
కేంద్రం ఆదేశాలతో సీఆర్‌పీఎఫ్ బలగాలు వెనక్కి..
భారత్ ‒పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో కర్రె గుట్టల్లో పాల్గొంటున్న కేంద్ర పోలీస్ బలగాలను వెనక్కి రావాల్సిందిగా శుక్రవారం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. శనివారం జవాన్లను తమ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆర్డర్స్‌లో పేర్కొంది. దీంతో తెలంగాణలోని వెంకటాపురం, వాజేడు, ఆలుబాక, పామూరు బెస్ క్యాంప్, ఛత్తీస్ గఢ్ లోని పామేడు, అవుపల్లి గ్రామాల్లోని సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా విభాగాలకు చెందిన 9 వేల మంది భద్రతా బలగాలు శనివారం వెనక్కి వెళ్లిపోయాయి.
ఉదయం నాటికే కర్రె గుట్టలపై నుంచి కిందికి దిగిన జవాన్లు తమకు కేటాయించిన వెహికల్స్ లో వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం రిపోర్ట్ చేయనున్నారు. అయితే తెలంగాణ, చత్తీస్ గఢ్ పరిధిలో పనిచేసే పోలీసులు కర్రెగుట్టల్లో ఆపరేషన్ కొనసాగించే చాన్స్ ఉన్నట్లుగా తెలిసింది.